Tuesday 30 April 2013

FIRST DOUBLE DECKER TRAIN IN SOUTH INDIA


డబుల్ డెక్కర్..సూపర్ హిట్


డబుల్ డెక్కర్ ఏసి రైలు ఐడియా సూపర్ హిట్‌ 
అయ్యింది. కూల్ కూల్ జర్నీని ప్రయాణికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రయాణికులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న చెన్నై-బెంగళూరు డబుల్ డెక్కర్ ఏసీ రైలు గురువారం పట్టాలెక్కింది. దక్షిణాదిన నడిచే తొలి డబుల్ డెక్కర్ ఇదే. ఇండియన్ రైల్వేస్ తన సంస్థ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలకోసం అన్వేషిస్తోంది.

అధిక సంఖ్యలో రైలు మార్గం ద్వారా ప్రయాణించేందుకు నూతన పద్దతులలో ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా బెంగుళూరు-చెన్నై మధ్య ప్రయోగాత్మకంగా ఈ రైలును ప్రవేశపెట్టారు. అందుబాటులో ఉన్న ధరకే అద్భుత ప్రయాణ అనుభూతి కలుగుతోందని ప్రయాణికులు తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు.

పది బోగీలున్న ఈ రైలులో నిత్యం 1200 మంది ప్రయాణించేందుకు అవకాశముంది. పూర్తిస్థాయి రిజర్వేషన్ సౌకర్యం ఉన్న ఈరైలు చెన్నైలో ఉదయం 7.25 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 1.30 గంటలకు బెంగళూరు చేరుతుంది. తిరిగి అక్కడి నుంచి 2.40 గంటలకు బయలుదేరి, రాత్రి 8.45 గంటలకు చెన్నైకు చేరుకుంటుంది.

ప్రయాణ చార్జీ రూ.470గా నిర్ణయించిన ఈ రైలులో తొలి రోజు చెన్నై నుంచి బెంగళూరుకు 500 మంది ప్రయాణించారు. అరక్కోణం, ఆంబూరు, జోలార్‌పేట, బంగారుపేట, కృష్ణరాజపురం, బెంగళూరు కంటోన్మెంట్‌ల మీదుగా ఇది ప్రయాణిస్తుంది. ఇందులో ఒకేసారి 12వందల మంది ప్రయాణించవచ్చు.

బోగీల్లో ఏసి చైర్ కారు సౌకర్యం ఉంది. 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలుకు జిపిఎస్ ఆధారిత సమాచార వ్యవస్థ అందుబాటులో ఉండడంతో, వచ్చే స్టేషన్ల వివరాలు, చేరుకునేందుకు పట్టే సమయం, ప్రయాణిస్తున్న వేగం ... ఇలా అన్నీ తెల్సుకోవచ్చు.

డబుల్ డెక్కర్ రైల్లో కేవలం చైర్‌కార్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. అన్ని కోచ్‌లలో ఏసీతోపాటు అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. సీట్లు కూడా విమానాల్లో మాదిరిగా ఉంటాయి. ఒక కోచ్‌లో రెండు అంతస్తుల్లో కలిపి 120 మందికి సీటింగ్ సదుపాయం ఉంటుంది. పై అంతస్తు నుంచి దిగువ అంతస్తు (కోచ్)కు వచ్చేందుకు మెట్ల మార్గం వుంటుంది. రాత్రివేళ కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆకర్షణీయమైన పసుపు రంగు అత్యాధునిక విద్యుత్ వెలుగులు ఏర్పాటుచేశారు.

10త్వరలో దేశంలోని అన్ని ప్రధాన మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ముందుగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా విశాఖ, తిరుపతి తదితర రద్దీ ఉండే ప్రాంతాలకు డబుల్ డెక్కర్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డబుల్ డెక్కర్ కోచ్‌లు త్వరలో తమకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రధానంగా విశాఖ నుంచి హైదరాబాద్, చెన్నై, భువనేశ్వర్, బెంగుళూరు, తిరుపతి మార్గాలను పరిశీలిస్తోంది. రైల్వే శాఖ ఆలోచనలు కార్యరూపం దాల్చితే ఈ ఏడాదిలో ఏదో ఒక మార్గానికి డబుల్ డెక్కర్ రైలు వచ్చే అవకాశం వుంది.

- See more at: http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=61608&subcatid=0&categoryid=28#sthash.MokLUiEu.dpuf

No comments:

Post a Comment