Tuesday 4 June 2013

జియా ఖాన్ ఆత్మహత్య చేసుకుంది.



'నిశ్శబ్ద్' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన బాలీవుడ్ నటి జియా ఖాన్ అర్థాంతరంగా తనువు చాలించింది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన ఆమె అనతి కాలంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఎంత త్వరగా ప్రేక్షకులకు దగ్గరైందో అంతే త్వరగా ఈ లోకం నుంచి నిశ్శబ్దంగా సెలవు తీసుకుంది. ముంబయి జూహులోని తన ఇంట్లో రాత్రి 11 గంటల సమయంలో జియా ఖాన్ ఆత్మహత్య చేసుకుంది.


సాగర్ తరంగ్ అపార్ట్ మెంట్ లో ఉంటున్న జియా ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడింది. ఈ సమాచారాన్ని మరో ప్రముఖ నటి దియా మిర్జా తన ట్విట్టర్ లో వెల్లడించారు. అమీర్ ఖాన్ తో కలిసి గజినీలోనూ, అక్షయ్ కుమార్ తో హౌస్ పుల్ చిత్రంలోనూ నటించింది. నటించింది కేవలం మూడు సినిమాలు మాత్రమే అయినా పేరుగాంచిన హీరోలతో ఆమె నటించడంతో ఆమెకు బాలీవుడ్ లో మంచి పేరు వచ్చింది. అయితే గత ఆరు నెలలుగా జియా ఖాన్ మీడియాకు, సినిమాలకు దూరంగా ఉంటోంది. డ్రగ్స్ కు అలవాటు పడిందని... తనకన్నా పెద్ద వయస్సున్న వ్యక్తిని వివాహం చేసుకుందని ఆమెపై పుకార్లు షికార్లు చేశాయి. అయితే అందులో ఎంత వాస్తవమనేది తెలియాల్సి ఉంది.

జియా ఖాన్‌ న్యూయార్క్‌లో పుట్టినా, పెరిగింది అంతా బ్రిటన్‌లోనే. ఆమె అసలు పేరు నఫీసా ఖాన్‌. ఆంజెలినా జోలీ నటించి జియా చిత్రం చూసిన తరువాత తన పేరును జియా ఖాన్‌గా మార్చుకుంది. ఆమె తల్లి రబియా అమిన్‌ కూడా 1980 ప్రాంతంలో సినిమాల్లో నటించింది. లండన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సు అభ్యసించిన జియాకు సినిమాలంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన అభిమానం. ఆమె తన తల్లి రబియాతో కలిసి ముంబయిలో ఉంటోంది. ఇంతకీ జియాఖాన్ మృతికి కారణాలేంటనేది అంతు చిక్కని ప్రశ్న. ఆమె మృతికి కుటుంబ సమస్యలా? లేక మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడిందా అనేది సస్పెన్స్ గా మారింది.

ఇక సినిమా తారలు విషయానికి వస్తే చాలామంది వెండితెర మీద కనిపిస్తూ ప్రేక్షక హృదయాలలో బంగారు కలలు పండిస్తుంటారు. కానీ వాళ్ల జీవితాల్లో రగిలే విషాదాలు మాత్రం అంత తొందరగా బైటపడవు. దివిలో వెలిగే తారల గురించి ఎందరు పట్టించుకుంటారోగానీ భువిమీద మెరిసే సినీతారలంటే అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. 'ఆనందం కలిగినప్పుడు అది నలుగురికీ పంచిపెట్టు. కానీ విషాదం సంభవించినప్పుడు మాత్రం అది నీ దగ్గరే దాచుకో' అని ఓ సుభాషితం ఉంది.

హాలీవుడ్ నుండి బాలీవుడ్, టాలీవుడ్...కోలీవుడ్ అయినా ఇందుకు మినహాయింపు కాదు. కొంతమంది తారల జీవితాలు పరిశీలిస్తే, కొన్ని ఆత్మహ త్యలు, కొన్ని హత్యలు, కొన్ని విషాదాంతాలు... కొందరివి తెలిసి చేసిన తప్పిదాలు.. కొందరివి మోసపోయిన సంఘటనలు. మరి కొందరివి నిస్సహాయతతో ఆవేశం కొద్దీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు. ఏది ఏమైనా ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన వారి జీవితాలు విషాదాంతాలు కావడం సినీ అభిమానులు జీర్ణించుకోలేనివే.
- See more at: http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=63466&Categoryid=28&subcatid=0#sthash.bh3wnqig.dpuf

No comments:

Post a Comment