Monday 4 November 2013

AMRUTAM KURISINA RAATRI

అమృతం కురిసిన రాత్రి _ దేవరకొండ బాల గంగాధర తిలక్.

అమృతం కురిసిన రాత్రి
అందరూ నిద్రపోతున్నారు
నేను మాత్రం
తలుపు తెరిచి ఇల్లు విడిచి
ఎక్కడికో దూరంగా
కొండదాటి కోనదాటి
వెన్నెల మైదానంలోకి
వెళ్ళి నిలుచున్నాను.


ఆకాశం మీద అప్సరసలు
ఒయ్యారంగా పరుగులెత్తుతున్నారు
వారి పాదాల తారా మంజీరాలు
ఘల్లు ఘల్లని మ్రోగుతున్నాయి
వారి ధమ్మిల్లాల పారిజాతాలు
గుత్తులు గుత్తులై వేలాడుతున్నాయి
వారు పృథు వక్షోజ నితంబ భారలై
యౌవన ధనుస్సుల్లా వంగిపోతున్నారు.

నన్ను చూసి కిలకిల నవ్వి ఇలా అన్నారు
చూడు వీడు
అందమైన వాడు
ఆనందం మనిషైన వాడు
కలల పట్టుకుచ్చులూగుతూన్న కిరీటం ధరించాడు
కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు
ఎర్రని పెదవులమీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు
ఎవరికీ దొరకని రహస్యాల్ని వశపరచుకున్నాడు
జీవితాన్ని ప్రేమించిన వాడు జీవించడం తెసిసినవాడు
నవ నవాలైన ఊహావర్ణార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు
ఇతడే సుమీ మన ప్రియుడు, నరుడు, మనకి వరుడు

జల జలమని కురిసింది వాన
జాల్వారింది అమృతంపు సోన
దోసిళ్ళతో తాగి తిరిగి వచ్చాను
దుఃఖాన్ని చావునీ వెళ్ళిపొమ్మన్నాను
కాంక్షా మథుర కాశ్మీరాంబరం కప్పుకున్నాను
జీవితాన్ని హసన్మందారమాలగా భరించాను
జైత్రయాత్ర పథంలో తొలి అడుగు పెట్టాను.

అమృతం కురిసిన రాత్రి
అందరూ నిద్రపోతున్నారు
అలసి నిత్యజీవితంలో సొలసి సుషుప్తి చెందారు
అలవాటునీ అస్వతంత్రనీ కావలించుకున్నారు
అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు
అనంత చైతన్యోత్సవాహ్వానాన్ని వినిపించుకోలేక పోయారు
    అందుకే పాపం
ఈనాటికీ ఎవరికీ తెలియదు
నేను అమరుడనని !
1962


రాత్రి వేళ _ దేవరకొండ బాల గంగాధర తిలక్.

రాత్రివేళ ఎవరూ లేరింట్లో మసకగా వున్న విద్యుద్దీపాల కాంతిలో
ఒక్కణ్ణీ బల్కనీలో కూర్చున్నాను. బోగన్ విల్లా పందిరిలో
ఒక్క నిముషం ఆగి తెరలు తెరల్లాగా వీచే గాలిలోంచి ఎవరిదో
ఏదో మధురాతి మధుర విషాదగానం నేరుగా వచ్చి గుండెల్లోకి
గుచ్చుకుంటోంది.


నిర్జన స్థలం, ఎవరూ లేరు, చుట్టూ పరచుకున్న మైదానపు
నగ్న దేహాన్ని సృశించబోయే నీచుల శిఖాగ్రపు వ్యగ్రపు
తొందర నిశ్శబ్ధం మెల్లగా అడుగులు వేస్తూ నడుస్తోంది, ఆకాశం
మీద ఒక్క చుక్క మరో నక్షత్రంతో మాట్లాడే మాటమాత్రం
మనసుకి వినిపిస్తోంది.

ఇంత రాత్రివేళ ఈ గానం ఎవరిదో చీకటి కాగితం మీద ప్లాటినం
తీగలాగ మెరుస్తోంది, ఏదో విషాదాన్ని హాయిని భయాన్ని పంచి
పెడుతూంది, ప్రాణాలకి అడుగునవున్న సుతారపు తీగల్ని
కదలిస్తోంది, ఏదో విధి దష్టమైన జీవితం కాబోలు పాపం
మొరపెడుతోంది జాలి జాలిగా, సంకీర్ణమైన విశ్వరహస్యం మరీ
మరీ నిగూఢమై కదలే నల్లని నీడలలో కలసిపోతోంది.

చెరచబడ్డజవ్వని విడివడిన పృథు శిరోజ భారంలాగ ఈ
నిశీధం మలిన మలినమైన చెదరిన తన అందాన్ని చీకట్లతో
కప్పుకుంటోంది, ఒంటరిగా నాలో ఊహలలో అవ్యక్తంలాగా
ఒదుగుతోంది, అనంతమైన శూన్యాన్ని అలుముకుంటోంది
ఏదో పాట సూత్రం ఏడు పేడుపుగా సన్నగా తీయగా గాలిలో
ఊగుతోంది, నీరవమైన ఏకాదశి నిశీధాన్ని రెండుగా చీలుస్తోంది.

1961 

No comments:

Post a Comment